61 మార్కులు వస్తే.. 4 వేశారు..

SMTV Desk 2017-10-21 14:08:30   BEHAR EDUCATION BOARD, HIGHCOURT, PATNA,

పట్నా, అక్టోబర్ 21: బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు 61 మార్కులు వస్తే..4 మార్కులు వేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఆరంభంలో బిహార్‌ బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. అందులో ప్రియాంక సింగ్‌ అనే విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఆమెకు సైన్స్‌లో 29, సంస్కృతంలో 4 మార్కులు వచ్చాయి. అయితే తాను పరీక్షలు బాగా రాశానని, ఫెయిల్‌ అయ్యే అవకాశమే లేదని ఆమె రీవాల్యువేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. రీవాల్యువేషన్‌ ఫలితాలు చూసి ప్రియాంక కంగుతింది. సంస్కృతంలో మార్కులు 4 నుంచి 9కి పెరగగా.. సైన్స్‌లో మాత్రం తొలుత 29 వస్తే ఈసారి 7 మార్కులే వేశారు. దీంతో ఆమె పట్నా హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు వారు ఆమె నుంచి రూ.40వేలు డిపాజిట్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రియాంక జవాబు పత్రాలను చూపించగా, అందులో ప్రియాంకకు సైన్స్‌లో 80 మార్కులు, సంస్కృతంలో 61 మార్కులు వచ్చాయి. దీంతో బోర్డు చర్యపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థినికి రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. గతంలో బోర్డు పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగడం, అక్షరం ముక్క రాని వాళ్లను టాపర్లుగా ప్రకటించడం బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు సాధారణంగా మారిపోయింది.