రేవంత్ రెడ్డి విషయంలో ఏపీ సీఎం మౌనం....

SMTV Desk 2017-10-20 16:44:14  TDP, AP CM Chandrababu naidu, lokesh, revanthreddy

అమరావతి, అక్టోబర్ 20 : కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా ఆంధ్రపదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి కదలికలు, ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నా.. ఈ వ్యవహారంపై టీడీపీ అధినాయకత్వం మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ఇటు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుగానీ, తనయుడు, మంత్రి లోకేశ్‌గానీ ఈ వ్యవహారంలో మౌనపాత్ర పోషిస్తున్నారు. రేవంత్‌ ఆరోపణలు దుమారం రేపుతున్నా.. టీడీపీ అధినేత, ఇతర నేతల మౌనం రాజకీయ పరిశీలకుల్ని విస్మయ పరుస్తోంది. ఏపీ టీడీపీ నేతలు సైతం ఓటుకు కోట్ల కేసు కారణంగానే రేవంత్‌పై పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌ వ్యవహారంలో టీడీపీ అధినాయకత్వం పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో ఉందని, ఆయనపై ఎలాంటి ఎదురుదాడి, విమర్శలు చేసినా, ఓటుకు కోట్ల కేసులో అది ఎదురుతన్నే అవకాశముందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు సైతం రేవంత్‌ వ్యవహారంలో గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.