కోచ్ అనిల్ కుంబ్లే పై నిరసన గళం...కొనసాగించవద్దంటూ డిమాండ్

SMTV Desk 2017-06-08 10:53:21  anilkumbley, coach , indian cricket, new coach

ముంబాయి, జూన్ 8 : కోచ్ అనిల్ కుంబ్లే పై టీమిండియా సభ్యులు నిరసన గళం విప్పారు. ఆయన ను తిరిగి కొనసాగించేందుకు తిరస్కరించారు. అందులో పది మంది ఆటగాళ్లు తప్పించాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 20 తో కోచ్ గా అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తకోచ్ నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ కుంబ్లే నేరుగా ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం ఉన్నా, దరఖాస్తు సమర్పించారు. అయితే కోచ్ అనిల్ కుంబ్లే ప్రాక్టిస్ సమయంలో జట్టు సభ్యుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నాడని, నిబంధనల పేరుతో అవస్థల పాలు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో చాలా అసౌకర్యంగా ఉంటోందని కెప్టెన్ కోహ్లీ సహా కొందరు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. రవిశాస్త్రి తరువాత గత ఏడాది జులైలో టీమిండియా కోచ్ గా కుంబ్లే బాధ్యతలు చేపట్టాడు. కుంబ్లే కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత భారత జట్టు తొలిసారిగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. అప్ప టి నుంచి ఇప్పటి వరకు ప్రతి సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంటూ వచ్చింది. సాధారణంగా అయితే కుంబ్లే విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడంతో ఆయన కాంట్రాక్ట్ ను 2019 ప్రపంచ కప్ వరకు పొడగిస్తారని అంతా భావించారు. కానీ బీసీసీఐ కొత్త కోచ్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, జట్టు మేనేజర్ శ్రీధర్ జట్టు సభ్యులతో మాట్లాడారు. క్రికెట్ సలహా మండలి సభ్యుడు గంగూలీ కూడా గత వారం టీమిండియా ఆటగాళ్ళతో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. ఇక విషయానికొస్తే టీమిండియా కోచ్ పదవికి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ పైబస్, మాజీ క్రికెటర్లు దొడ్డా గణేష్, లాల్ చంద్ రాజ్ పుత్ దరఖాస్తు చేసుకున్నారు.