దేశంలోని ప్రతి జిల్లాకు ఆయుర్వేద ఆసుపత్రులు : ప్రధాని మోదీ

SMTV Desk 2017-10-18 16:27:50   Indian Prime Minister Narendra Modi, Ayurvedic hospitals, government

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పేదలకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ఆయుర్వేద ఆసుపత్రుల్ని నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోదీ తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య విధానాల కింద ఆరోగ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఢిల్లీలో నిర్మించిన అఖిల భారత ఆయుర్వేద సంస్థ’ను మంగళవారం ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ- సకల సదుపాయాలతో ఆయుర్వేద ఆసుపత్రులు అన్ని జిల్లాల్లో ఉండేలా ఈ రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఈ దిశగా తీవ్రంగా కృషి చేస్తోందని, గత మూడేళ్లలో 65 ఆయుష్‌ ఆసుపత్రుల్ని అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడానికి ప్రైవేటు రంగంలోని సంస్థలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధుల్ని వినియోగించాలని ఆయన కోరారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద వాతావారణాన్ని మనం తీసుకురావాలి అని మోదీ వెల్లడించారు.