పొంగి ప్రవహిస్తున్న బాహుదా నది...ప్రజల అప్రమత్తం

SMTV Desk 2017-10-12 12:32:12  Bahuda river, Kadapa, Ananthapuram rainniging

కడప, అక్టోబర్ 12: కడప, అనంతపురం జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో బుధవారం కడప జిల్లాల్లో కురిసిన వర్షానికి పలు వాగులు, వంకలు ప్రవహించి బాహుదా నదిలో కలుస్తున్నాయి. ఈ నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల బెస్తపల్లె సమీపంలో ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. అదే సమయంలో వంతెనపై ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికులను రక్షించి, బస్సును జేసీబీ, ఇటాచీ ద్వారా ఒడ్డుకు చేర్చారు. బహుదానది నీటి ప్రవాహం పెరిగి ఈ నీటి ప్రవాహం మొత్తం వై. ఆదినారాయణ రెడ్డి పించా జలాశయంలోకి ప్రవహించడం వల్ల గురువారం ఉదయం 3100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని పించా జలాశయం సిబ్బంది వెల్లడించింది. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో పీలేరు, సదుం ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి మూడు చెరువులు తెగడంతో పీలేరు నదిలో నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పీలేరు, బాహుదా నదుల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.