ప్రభుత్వ అధికారులకై రూ.2652 కోట్లతో రాజధానిలో ఇళ్లు

SMTV Desk 2017-10-12 11:11:51  The house for government officials, capital city amaravathi updates.

అమరావతి, అక్టోబర్ 12 : అమరావతి పరిపాలన నగరంలో తలపెట్టిన ప్రభుత్వ అధికారుల గృహ సముదాయాల నిర్మాణ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,652 కోట్లకు పెరిగింది. మొత్తం 61 టవర్లలో వివిధ కేటగిరీలకు చెందిన 3,840 ఫ్లాట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భవనాల ప్రాథమిక ఆకృతుల నిర్మాణ శైలిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 10 రకాల నిర్మాణ శైలితో రూపొందించిన టీం వని౦డియా సంస్థ ఈ ఆకృతులను రూపొందించి౦ది. బాహ్య ఆకృతులను చూసి ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో బ్లాకుకు ఒక్కో నిర్మాణాన్ని ఉపయోగించుకునేలా తుది ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం మొత్తం 18 టవర్లలో విలాసవంతమైన అపార్ట్ మెంట్ లను నిర్మించనున్నారు. ఒక్కో ప్లాట్ ఏరియా 3,500 చదరపు అడుగులుగా నిర్ణయించారు. దానికి అనుబంధంగా క్లబ్ హౌస్, పార్కింగ్ ప్రదేశాలను నిర్మించనున్నారు. నాన్-గెజిటెడ్ అధికారుల కోసం 1200 చదరపు అడుగులను కేటాయించారు. టైప్‌-1 గెజిటెడ్ అధికారుల కోసం 8 టవర్లు(1800 చదరపు) అడుగులు, టైప్‌-2 గెజిటెడ్ అధికారుల కోసం(1500 చదరపు) అడుగుల ఏరియాతో మొత్తం 7 టవర్లతో నిర్మించనున్నారు. అలాగే నాలుగో తరగతి ఉద్యోగుల కోసం ఒక్కో ప్లాటు 900 చదరపు అడుగుల నిర్మాణ ఏరియాతో ఆరు టవర్లను నిర్మించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలంటూ అధికారులకు నిబంధనను విధించారు. ఈ టెండరు ప్రక్రియను ఎన్సీసీ, షాపూర్ జీ పల్లోంజీ, ఎల్అండ్ టీ నిర్మాణ సంస్థలను ఎంపిక చేశారు.