డీఎస్సీ పై కొత్త ఎత్తుగడలున్నాయా..?

SMTV Desk 2017-10-11 13:47:27  dsc notification, telangana government, cm kcr, updates.

హైదరాబాద్, అక్టోబర్ 11 : తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు డీఎస్సీ పై ముందుకి పోవడం వెనక కారణాలు లేకపోలేదు. సరిగ్గా 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతుందా? అన్నారు. దానిపై డీఎస్సీ అభ్యర్థులతో పాటు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే.. *4 రోజుల్లో ఎం జరిగింది.? *ప్రభుత్వం ఎందుకు యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది? *ఇప్పటికిప్పుడు డీఎస్సీ పై కదలిక రావడానికి కారణాలున్నాయా? *అసలు నోటిఫికేషన్ విడుదల చేస్తారా? *ఇది మళ్ళీ కొత్తగా తెర వెనుక నాటకానికి నాందీయా? ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు సంబంధి౦చిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో ఎన్నడు లేని విధంగా, మొదటిసారిగా నియామకాలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. తెలంగాణలో డీఎస్సీ నియామకం చేయకపోవడానికి గల కారణాలు తెలపాల్సిన అవసరం ఏర్పడింది. అసలు డీఎస్సీ వేయకపోవడానికి ప్రత్యేకించి కారణాల౦టూ ఏమిలేవు కనుక ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే పక్షంలో, ముఖ్య కార్యదర్శిని విచారించే అవకాశం, సమస్య రాదు. అందుకే త్వరగా డీఎస్సీపై అభిప్రాయంలో మార్పు వచ్చిందని భావించాల్సి వస్తోంది. ఇందులో మరో కిటుకు కూడా ఉంది. అదేంటంటే... తెలంగాణలో నూతన జిల్లాలకు సంబంధించిన గవర్నమెంట్ గెజిట్(రాజపత్రం) నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. కనుక ఇప్పుడు నూతన జిల్లాల వారిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే ప్రతిపక్ష పార్టీల వారు, ఉమ్మడి జిల్లాల నోటిఫికేషన్ కోరుకునే వారు అసమ్మతితో తిరిగి కోర్టును ఆశ్రయిస్తారు. అప్పుడు నూతన జిల్లాల డీఎస్సీ నోటిఫికేషన్ పై స్టే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన, సుప్రీం దృష్టిలో నోటిఫికేషన్ ఇచ్చినట్లూ అవుతుంది.. స్టే రావాలన్న కోరికా నెరవేరుతుంది. అంటే కావాలనే నూతన జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వెలువడటం దానిపై రాద్దాంతం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు పోయి స్టే తేవడం ఒకదాని వెంట ఒకటి జరుగుతాయి. అప్పుడు చాణక్య నీతిని కనబరుస్తూ, "చూశారా మేము డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు పోయి స్టే తెస్తున్నాయి" అంటూ వారిపైనే లోపం మోపవచ్చు. అప్పుడు నిరుద్యోగులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నా, ఇతరులే అడ్డుకుంటున్నారని గొంతెత్తి చెప్పవచ్చన్న ఉపాయాలు ఇక్కడ కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..