విశాఖలో భూమి పూజ చేసిన చంద్రబాబు......

SMTV Desk 2017-10-10 13:14:25  AP CM Chandrababu, Formers, Park Opening

ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడానికి ప్రతిపాదనలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం కర్నూలు జిల్లాలోని తంగడంచ గ్రామంలో మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన సీఎం అదే సభలో మూడో విడత రైతు రుణ మాఫీని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...రైతుల రుణమాఫీకి నిధులను కేటాయించడం....మెగా సీడ్ పార్క్ ను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచానికి మన రాష్ట్రాన్ని విత్తన రాజధానిగా మారుస్తామని చెప్పారు. ఇంతకుముందు ఐటీ రంగంపై దృష్టి పెట్టామని....ఇప్పుడు వ్యవసాయం, రైతులు, సాగునీటి సమస్యలపై దృష్టి పెట్టి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీకి మూడు విడతల్లో రూ.14 వేల కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. అనంతరం విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థకు ముఖ్యమంత్రి భూమి పూజా చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్.వై.దొర మాట్లాడుతూ...ఈ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో విద్యుత్ సరఫరాకు, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. దీనికి ప్రపంచ బ్యాంకు రూ. 720 కోట్లనూ మంజూరు చేసిందని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు వెంకటరావు, చినరాజప్ప, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.