కేరళలో తొలిసారిగా రాష్ట్రపతి...

SMTV Desk 2017-10-09 16:27:47   Indian President Ramnath Kovind, Kerala Tour , Fresh water scheme, Started.

కొల్లం, అక్టోబర్ 09 : ఆది శంకరాచార్యుడు, నారాయణ గురువువంటి ఆధ్యాత్మిక వేత్తలకు కేరళ నిలయమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కేరళలోని కొల్లం సమీపంలోని వల్లిక్కావులో మాతా అమృతానందమయి మఠం రూ.100 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ప్రారంభించారు. ఈ నీటి పథకం ద్వారా దాదాపు 10 లక్షల మంది గ్రామీణులకు మేలు కలగనుంది. మాతా అమృతానందమయి (అమ్మ) 64వ జన్మదినం సందర్భంగా జీవామృతం పేరుతో ఈ పథకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తూ... పేదలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన సేవ అని తెలిపారు. అలాగే సైనికుల ధైర్యసాహసాలు, ఆధ్యాత్మిక వేత్తల ప్రేమ, కరుణలే దేశానికి మూల స్తంభాల్లాంటివని చెప్పారు. కేరళలో తొలిసారిగా పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్‌ ను స్వాగతించేందుకు గవర్నర్‌, ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, తదితరులు విచ్చేశారు. స్వాగతంలో భాగంగా తిరువనంతపురం విమానాశ్రయం వద్ద ఆయనకు సైనికుల గౌరవ వందనం ఏర్పాటు చేశారు. కోవింద్ విమానం దిగిన సమయంలో జోరుగా వర్షం కురిసింది. భద్రతా సిబ్బంది గొడుగు పట్టడానికి ప్రయత్నించగా ఆయన దాన్ని నిరాకరించి వర్షంలోనే వేదికపై నిలబడి గౌరవ వందనం స్వీకరించారు.