లాజిస్టిక్‌ పార్కు కు శంకుస్థాపన చేసిన మంత్రులు...

SMTV Desk 2017-10-07 14:37:06  Foundation Stone Laid for Logistic Park by Minister KTR

హైదరాబాద్, అక్టోబర్ 07 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో 35 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్‌పార్కు కు మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, మహేందర్ రెడ్డి లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, రవాణాశాఖ కమిషనర్‌ సునీల్‌శర్మ, లాజిస్టిక్‌పార్కు డైరెక్టర్లు రాజశేఖర్‌, నీలిమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రవాణా, మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. చైనాలోని బీజింగ్‌ నగరానికి ఐదు వలయ రహదారులు ఉండటంతో అభివృద్ధి సాధ్యపడిందని, అదే తరహాలో నగరం చుట్టూ 340 కిలోమీటర్ల ప్రాంతీయ వలయ రహదారులను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వీటి నుంచి బాహ్య వలయ రహదారిని అనుసంధానిస్తూ 62 రోడ్లను, 35 రేడియల్‌ రోడ్లను ఏర్పాటు చేయడంతోపాటు నగరం చుట్టూ 12 లాజిస్టిక్‌ పార్కులు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే రూ.60 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మంగల్‌పల్లి, బాటసింగారంలో రెండు లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రివర్గ ఆమోదం అనంతరం మిగతా 10 లాజిస్టిక్‌ పార్కులను ప్రకటిస్తామన్నారు. ప్రజల అంగీకారంతోనే భూములు తీసుకుంటామని చెప్పారు.