జీఎస్టీ భేటీలో కీలక నిర్ణయాలు ... ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

SMTV Desk 2017-10-07 12:14:48  GST, Meeting in Delhi, Union Finance Minister Arun Jaitley

న్యూఢిల్లీ, అక్టోబర్ 07 : దేశంలో వస్తు-సేవా (జీఎస్టీ) పన్ను విధానం అమలులోకి వచ్చి మూడు నెలలు గడిచిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో చిన్న వ్యాపారులకు ఊరటను ఇచ్చే పలు నిర్ణయాలను తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న ఈ భేటీ, శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ భేటీలో పన్నుల చెల్లింపు రిటర్నుల దాఖలలో చిన్న, మధ్యతరహా వ్యాపారులకు పలు మినహాయింపులు కల్పిస్తూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రిటర్నులు సమర్పించడం పన్ను తిరిగి పొందడం వంటి సమస్యలు లేకుండా ఒకేసారి పన్ను చెల్లించే కాంపోజిషన్‌ పథకం పరిధిని పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఎగుమతి దారులకు త్వరితగతిన పన్ను తిరిగి ఇవ్వాలని నిర్ణయించిన మండలి జూలై, ఆగస్టు నెలకు సంబంధించి ఈ నెల 18 లోపు పన్ను తిరిగి పంపించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఎగుమతి దారులు 0.1% ముందస్తు పన్ను చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఏసీ రెస్టారెంట్ల పై పన్నును 18% నుంచి 12%కి తగ్గించేందుకు జీఎస్టీ మండలి సూత్ర ప్రాయంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో అత్యధికంగా మానవ వనరులపై ఖర్చు చేయాలని సాగునీటి ప్రాజెక్టుల పై వసూలు చేసే జీఎస్టీని 5%కి తగ్గిస్తూ మండలి నిర్ణయం తీసుకుందని జైట్లీ వివరించారు. దేశంలో వసూలయ్యే మొత్తం పన్నులో 94% నుంచి 95% వచ్చే పెద్ద వ్యాపారులు మాత్రం ప్రతి నెల రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.