ముద్రగడకు మళ్లీ బ్రేక్.. కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత

SMTV Desk 2017-10-07 12:08:14  Mudragada Padmanabham, kapu reservations, kirlampudi.

కాకినాడ, అక్టోబర్ 7 : కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం గతంలో కాపు సంఘానికి రిజర్వేషన్ ల విషయమై " ఛలో అమరావతి" పేరిట పాదయాత్రలను చేపట్టగా.. ఆయనను చాలా కాలం పాటు గృహనిర్భంధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ మరోసారి కోనసీమలో పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా పోలీసులు ఆయనను కట్టడి చేసేందుకు కిర్లంపూడిలో భారీ భద్రత బలగాలను మోహరించడం సంచలనం సృష్టిస్తోంది. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయ పలకరింపు నిమిత్తం ఈ పర్యటనను చేస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. కాగా ముద్రగడ ఎలాంటి పాదయాత్రలు గాని, పర్యటనలు గాని చేసినా.. తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితులు. ఈ విషయంపై ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... "ముద్రగడ తన వ్యక్తిగత జీవితంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు. ఆయన వ్యక్తిగత పర్యటనలకు సైతం పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు. అభిమానులు మాత్రం ముద్రగడను ఇక జీవితాంతం గృహనిర్భంధం చేస్తారా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ముద్రగడ ఈ నెల 8,9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నారు.