సిద్దిపేటలో ఉరకలేస్తున్న గోదావరి జలాలు

SMTV Desk 2017-10-05 12:12:12   Irrigation Minister, Harishrao, Gajewal constituency, Godavari waters.

సిద్దిపేట, అక్టోబర్ 5 : సిద్దిపేట జిల్లాలో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని ఏడు చెరువులకు గోదావరి జలాలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమాన్ని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గ నాయకులతో కలిసి పూజా కార్యక్రమాల్ని నిర్వహించి లాంఛనంగా జలాలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. " ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు, ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంతో నా జన్మ ధన్యమైంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు" అంటూ తెలిపారు. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ ద్వారా చెరువులను నింపుతూ ఏడాదిలో కనీసం రెండు పంటలకు నీళ్ళను అందించాలనే ఉద్దేశ౦తో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీస్ కమీషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.