ఐఎస్ఐ పై అమెరికా ఆరోపణలను ఖండించిన పాక్

SMTV Desk 2017-10-04 19:24:12  Pakistani intelligence agency ISI, America , ISI Runs its Own Foreitgn Policy

వాషింగ్టన్, అక్టోబర్ 04 : పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని దానికి ప్రత్యేకంగా విదేశాంగ విధానం ఉందని అమెరికా సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. తాలిబాన్లకు ఐఎస్ఐ మద్దతు ఇస్తున్నదని సెనేట్‌ జోయి అడిగిన ప్రశ్నకు సమాధానంగా యుఎస్ జనరల్ జోసఫ్ డన్‌ఫోర్డ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ వైఖరిలో మార్పు రావాలంటే బహుళపక్ష విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐ కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, గతంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ అనేక సార్లు ఆరోపించగా అమెరికా కూడా ఈ జాబితాలో చేరింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఇప్పటికే ఆరోపించిన అమెరికా రక్షణమంత్రి మాటీస్, ఐఎస్ఐ పాక్ ప్రభుత్వ నియంత్రణలో లేదని దానికి ప్రత్యేక విదేశాంగ విధానం ఉందని తెలిపారు. అయితే, అమెరికా చేసిన ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. గతంలో ఉగ్ర మూకలకు ఊతమిచ్చింది అమెరికానే అని ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ఆరోపించారు. కాగా పాక్‌ విదేశాంగ మంత్రి వాషింగ్టన్‌ చేరుకోడానికి కొద్ది గంటల ముందే ట్రంప్‌ పాలనావిభాగంలోని ఓ కీలక అధికారి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆసిఫ్‌ నేడు అమెరికా బయల్దేరారు. పర్యటనలో భాగంగా ఆసిఫ్‌.. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌, జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్‌లతో సమావేశం కానున్నారు.