రైతుల పిటిషన్ పై విచారణ వాయిదా

SMTV Desk 2017-06-06 15:41:26  Peddapalli distirict,Goliwada Village,Government,High court

న్యూఢిల్లీ, జూన్ 6 : పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండలంలో గోలివాడ గ్రామంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం నిర్మించే సుందిళ్ళ బ్యారేజీ పంప్ హౌస్ విషయంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు. పంప్ హౌస్ నిర్మిస్తున్న 240 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా, ఆ భూముల నుంచి తమను ఖాళీ చేయించకుండా దిశానిర్దేశం చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టి వేస్తూ హై కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ దీపక్ గుప్తా విచారణ చేపట్టారు. గోలివాడ గ్రామంలో సేకరించడానికి పూనుకున్న 240 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే విషయంలో తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఏ రకమైన జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చిందని , దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతుల తరపు న్యాయవాది మనోజ్ పరాశరన్ వాదించారు. పిటిషనర్లు కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారని , బాధితుల్లో కొంతమంది ప్రభుత్వ పరిహారాన్ని అందుకున్నారని ప్రభుత్వం తరపు హాజరైన అటార్నీ జనరల్ ముఖుల్ రోహాత్గీ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను క్షుణ్ణంగా చదవాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించారు. సింగిల్ గా కేసులను విచారించడం సంప్రదాయం కాదని దీపక్ గుప్తా విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేయడం జరిగింది.