స్వచ్ఛభారత్ దిశలో విశాఖపట్నం...

SMTV Desk 2017-10-03 19:43:21  Visakhapatnam, Svacchabharat, The third rank In India

విశాఖపట్నం, అక్టోబర్ 03 : స్వచ్ఛ సర్వేక్షణలో మూడో ర్యాంకు, స్వచ్ఛ పోర్టుల జాబితాలో రెండో ర్యాంకు, స్వచ్ఛ రైల్వే స్టేషన్ల వరుసలో మొదటి ర్యాంకు ఇవన్నీ ఒక్క విశాఖనగరమే కైవసం చేసుకుంది. సుందర నగర తీరం ఆహ్లాదమైన తూర్పు కనుమలు మధ్య స్వచ్ఛ నగరంగా విశాఖ అందరీ దృష్టిని ఆకర్షిస్తుంది. 2014 లో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రారంభమైన పదో రోజునే విశాఖను హుదూద్ తుఫాను విలయం కుదిపేసింది. సుందర నగరం చాలా దెబ్బతింది. అయిన ప్రజలు కుంగి పోకుండా నవ విశాఖ నిర్మాణ దిశగా నడుం బిగించారు. ప్రభుత్వ పట్టుదల అధికారుల చిత్త శుద్ధి ప్రజల భాగస్వామ్యంతో విశాఖ సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. హుదూద్ తుఫాను కష్టాల నుంచి గట్టెక్కిన విశాఖ, మరో అడుగు ముందుకేసి స్వచ్ఛ ఉద్యమంలో లక్ష్యం నిర్దేశించుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు అతిధ్యమిస్తున్న నగరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు రహదారులు, పాదాచారుల మార్గాలు, పచ్చదనం పెంపొందించారు. విశాఖ ఘనతపై హర్షం వ్యక్తమవుతోంది. 2018 నాటికీ స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన స్థానం దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్వచ్ఛ నగరాలూ పరిశుభ్రతే కాదు, ఆరోగ్యానికి, ఆనందానికి నిలయాలు పరిసరాల శుభ్రతతో నగరాన్ని స్వచ్చంగా మార్చుకోగలరని విశాఖ ప్రజలు నిరూపించారు.