ఖతర్ తో తెగతెంపులు

SMTV Desk 2017-06-06 14:45:25  qatar,soudi arebia, egipt, oman, westran asia

రియాద్, జూన్ 6 : ఖతర్ ఉగ్రవాదానికి మద్దతు పలుకుతోందని, ఊతమిచ్చేలా చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తు పొరుగు దేశాలు వెలేశాయి. దాంతో పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం తలెత్తింది. ఆ దేశంతో సౌది అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్ ను వెలేసింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు సోమవారం ఆరోపించాయి. ఖతర్ తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశం లోని ఖతర్ పౌరులు రెండు వారాల్లోగా వెళ్ళిపోవాలని ఆయా దేశాలు ఆదేశించాయి. సరిహద్దులు మూసివేతతో ఖతర్ లో ఆహార సంక్షోభం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పు నుంచి మా దేశాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం..ముస్లిం బ్రదర్ హుడ్, దాయెష్ (ఐఎస్), అల్ కాయిదా వంటి గ్రూపులకు ఖతర్ మద్దతిస్తోంది..మా దేశంలోని షియా లు అధికంగా ఉన్న ఖతిఫ్ తో పాటు బహ్రెయిన్ లో ఇరాన్ ప్రోద్బలంతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా అండగా నిలుస్తోంది అని సౌది పేర్కొంది. గల్ఫ్ దేశాలు సంరక్షక పాత్రతో తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నాయని ఖతర్ ఆరోపించింది. వాటి చర్యలు సమర్థనీయం కాదు..తప్పుడు, నిరాధార ప్రకటనల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నాయి అని ఖతర్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఖతర్ తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌది అరేబియా వెల్లడించగా, ఖతర్ కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా,సౌదీ అరేబబియా ప్రకటించాయి. ఈజిప్టు కూడా అదే బాటలో సర్వీసులను నిలిపేసింది. యెమన్ లో ఇరాన్ మద్దతున్న రెబల్స్ పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్ ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్ తో పొరుగుదేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్ తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్ బేస్ ఖతర్ లో ఉంది. 2022 లో పుట్ బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్ లోనే జరగనున్నాయి. ఆహార పదార్ధాలతో పాటు చాలా వస్తువులను ఖతర్ పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.