తెలంగాణలో నేడు మహాబతుకమ్మ సంబరాలు

SMTV Desk 2017-09-26 11:53:51  Bathukamma celebrations in thelangana state, LB Stadium

హైదరాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆరాధ్యమైన ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ మహిళలు కను విందుగా జరుపుకుంటున్నారు. నేడు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో వచ్చే మహిళలతో ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడకలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు ఇతర మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 31 జిల్లాల్లోని 429 మండల కేంద్రాల నుంచి మహిళలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బస్సుల్లో వచ్చే ప్రతీ ఒక్కరికి భోజనం, తాగునీరు తో పాటు మౌళిక వసతులు కల్పించారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా గిన్నీస్‌ రికార్డును నెలకొల్పాలని మహిళలు సంకల్పించారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇతర శాఖలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే మహాబతుకమ్మ వేడుకలకు అన్ని జిల్లాల నుంచి మహిళలు తరలిరావాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజెప్పాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడె రాజీవ్‌ సాగర్‌ కోరారు.