కిట్లను పకడ్బందీగా పంపిణీ చేయాలన్న మంత్రి సమీక్ష

SMTV Desk 2017-06-06 12:23:44  kcr kites , health minister lakshmareddy, mother,baby

హైదరాబాద్, జూన్ 6 : మాతాశిశు సంరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ఆలోచనతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ.లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై మంత్రి సమీక్షను నిర్వహించారు. కేసీఆర్ కిట్ల పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మంత్రి అధికారులను అడిగి మరి తెలుసుకున్నారు. ఈ కిట్ల పంపిణీలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గర్భిణుల గుర్తింపు, నమోదు, క్రమం తప్పకుండా పరీక్షలు, మాతాశిశు సంక్షేమ గుర్తింపు కార్డులజారీ, ఆర్థికసాయం వర్తింపు, సుఖప్రసవాలు, కేసీఆర్ కిట్ల పంపిణీ, తల్లి బిడ్డలను క్షేమంగా వారి ఇండ్లకు చేర్చడం వంటి అన్ని ప్రక్రియలను సవ్యంగా జరిగేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కిట్లు, అందులోని వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. రాష్ట్రంలోని వివిధ సర్కారు దవాఖానాల్లో సదుపాయాలు, వైద్య సేవలపై చర్చించిన మంత్రి..పేద ప్రజలకు వైద్యసేవలు సవ్యంగా అందేలా చూడాలని ఆదేశించారు. వైద్య పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు పూర్తిచేసి, ఆయా దవాఖానల్లో సేవలు ప్రారంభించాలని అన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సంయుక్త కార్యదర్శి భారతి లక్పతీనాయక్, డీఎంఈ రమణి, డీహెచ్ లలితకుమారి, కేసీఆర్ కిట్ల సీఈవో సత్యనారాయణరెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సీఈ లక్ష్మంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.