పాక్ మాజీ ప్రధానికి మరో షాక్...

SMTV Desk 2017-09-23 14:28:46  Nawaz Sharif, Islamabad, Pakistan, Bank accounts seized.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 23 : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఆయనకు సంబంధించిన ఆస్తులను, బ్యాంక్ అకౌంట్‌లను సీజ్ చేస్తున్నట్లు అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) వెల్లడించింది. పనామా పత్రాల కేసులో షరీఫ్‌పై అవినీతి, మనీల్యాండరింగ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఆ దేశ సుప్రీంకోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో షరీఫ్ తో పాటు ఆయన కూతురు మరియమ్‌కు కూడా అకౌంటబులిటీ కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే లాహోర్‌లో ఆయన ఆస్తులు జప్తు చేస్తున్నట్టు నోటీసులు అందించారు. కాగా ప్రస్తుతం నవాజ్ షరీఫ్ లండన్ లో ఉన్నట్లు సమాచారం.