భూ ప్రక్షాళన పై కేసీఆర్ సంతృప్తి

SMTV Desk 2017-09-23 12:08:24  CM KCR, Earth Survey Progress, KCR review with officials in Pragati Bhavan, Farmers

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణలో సుమారు నాలుగు దశాబ్దాల తరువాత చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఆశించినట్టుగానే జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన భూ సర్వే పురోగతిపై ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్. ఈ సందర్భంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణ, పేరు మార్పిడి త్వరగా జరుగుతుండడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమకోడ్చి విజయవంతం చేస్తున్నారని, వారికి నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి దశ భూ ప్రక్షాళన కార్యక్రమం పూర్తి కాగానే, స్పష్టత వచ్చిన భూములకు సంబంధించి కొత్త పాస్‌పుస్తకాలు అందించి.. సవరించిన రికార్డుల ఆధారంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాగా భూమి యాజమాన్యంపై స్పష్టత రావడం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశమని సీఎం కేసీఆర్ వెల్లడించారు.