ప్రాణాలు తీసిన అతివేగం

SMTV Desk 2017-06-06 12:15:14  accident, chinthkunta cheak post, raghavender, Ashok, saikiran

హైదరాబాద్, జూన్ 6 : మోటరు సైకిల్ ను అతివేగంగా..అజాగ్రత్తగా నడిపి ప్రాణాలు తీసుకున్నాడో యువకుడు. దాంతో పాటే మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయి ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. త్రిపుల్ రైడింగ్ తో పాటు అతివేగంగా ప్రయాణిస్తున్న ఆ మోటరు సైకిల్ అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న భూగర్భ రహదారి గుంతలో పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హయత్ నగర్ వైపు నుంచి ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వైపు సీబీజెడ్ మోటారు సైకిల్ (ఏపీ 29 ఏపీ 5910) పై బడంగ్ పేట గాంధీనగర్ కు చెందిన యువకులు రాఘవేందర్ (23), అశోక్ (23), సాయికిరణ్ (22)లు ప్రయాణిస్తున్నారు. అయితే చింతలకుంట చెక్ పోస్ట్ సమీపంలో ఓపెన్ హౌజ్ బార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న సబ్ వే 20 అడుగుల గుంతలో ప్రమాదవశాత్తు వాహనంతో సహా పడిపోయారు. దీంతో వాహనం నడుపుతున్న రాఘవేందర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, అశోక్, సాయికిరణ్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అశోక్, సాయికిరణ్ లను చికిత్స నిమి త్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రాఘవేందర్ ప్రైవేటు ఉద్యోగి. అతనికి వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. చింతల కుంట చెక్ పోస్ట్ వద్ద సబ్ వే నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో భారీగా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన మేర బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరువైపులా వాహనాలు వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు మధ్యలో రాత్రివేళ పనులు జరుగుతుండడంతో వారి వాహనాలు రావడానికి కొంతమేర బారికేడ్లను తొలగించారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రివేళ బైక్ పై వేగంగా వచ్చిన రాఘవేందర్, అతని స్నేహితులు రోడ్డు మధ్యలో బారికేడ్ల సందు నుండి నేరుగా వెళ్ళి గుంతలో పడిపోయారు. యువకుల అతివేగం, నిర్మాణం పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వివరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.