రేపటి నుంచి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

SMTV Desk 2017-09-22 09:40:41  brahmostvaalu, tirmula, ap cm chandrababunaidu

తిరుమల సెప్టెంబర్ 22 : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. శుక్రవారం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరగనుంది. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా శనివారం తిరుమలకు రానున్నారు. ఈ మేరకు అధికారిక పర్యటన ఖరారైంది. పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుని ఇక్కడే బస చేసి ఆదివారం ఉదయం విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఈ నెల 23 న ధ్వజారోహణం, 27 న గరుడ వాహనం, 28 న స్వర్ణ రధం, అక్టోబర్ ఒకటవ తేదీన చక్రస్నానం కార్యక్రమాలు జరగునున్నాయి. భక్తకోటికి శ్రీవారి వాహన సేవలతో పాటు స్వామివారి మూలమూర్తి దర్శనాన్ని ఒకేరోజు కల్పించేలా సన్నాహాలు చేస్తోంది. వాహనసేవలను భక్తకోటి తిలకించడానికి అనువుగా గ్యాలరీల్లో సౌకర్యాలు విస్తృత పరిచింది. తిరుమల క్షేత్రం యావత్తు బ్రహ్మోత్సవ శోభతో కళకళలాడుతుంది. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తోంది. పత్ర, పుష్ప, ఫల, ఛాయా చిత్ర పదర్శనలు, సైకత శిల్పం అలరించనున్నాయి. ఈ ప్రదర్శనల వద్ద ఆయోధ్య రాజమందిరంలో శ్రీరామచంద్రుడు లవకుశలు గానం చేస్తుండగా వింటున్న దృశ్యకావ్యంపై భారీ సెట్టింగ్‌ నిర్మిస్తున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో ఈ రాజమందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.