వైద్యాధికారుల పదవి విరమణపై ప్రభుత్వం తర్జనభర్జన

SMTV Desk 2017-06-05 19:22:30  PG Medical seats,Doctor retirement age, Andhrapradesh,MCI

హైదరాబాద్‌, జూన్‌ 5 : రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంచనున్నారా? ఆ దిశలో ప్రభుత్వం యోచిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న వైద్య పథకాలు, పెరిగిన పీజీ వైద్య సీట్లను పరిగణనలోకి తీసుకుని వైద్యుల పదవి విరమణ వయసు పెంచాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో వైద్యుల పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంచుతూ వారం క్రితం ఉత్తర్వులు జారీ చేయడం, కేంద్ర ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లు ఉండడం వంటి విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వైద్యుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే వైద్యుల పదవీ విరమణ వయసు పెంచితే ఇతర ఉద్యోగుల నుంచి కూడా ఒత్తిడి వచ్చే వీలుందా అన్న మీమాంస మధ్య దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధికారులు అంతర్గత నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయసును 70 ఏళ్ల వరకు పెంచుకునే వెసులుబాటును భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇప్పటికే కల్పించింది. దీనిపై గతంలో అభిప్రాయం కోరినా, ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు ఇప్పటికే ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 70 ఏళ్లుగా పరిగణిస్తుండగా, నిమ్స్‌లో అది 60 ఏళ్లు. కానీ రాష్ట్రంలో మాత్రం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్యులు, వైద్య ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయసు కూడా 58 ఏళ్లుగానే ఉంది. # పీజీ సీట్లు పెరిగినా వెంటాడుతున్న ప్రొఫెసర్ ల కొరత: రాష్ట్రంలో ఈ ఏడాది పీజీ వైద్య సీట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఆ సీట్లు కొనసాగాలంటే అవసరమైన సంఖ్యలో ప్రొఫెసర్లు ఉండాలి. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు రిటైర్‌ కానున్నారు. ఆ స్థానాలను వెంటనే భర్తీ చేయడం సాధ్యం కాదు. పదోన్నతులపైనే వాటి నియామకం చేపట్టాల్సి ఉంది. తగిన సంఖ్యలో ప్రొఫెసర్లు లేకపోతే, కొత్తగా వచ్చిన పీజీ వైద్య సీట్లు రద్దయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో వైద్య సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కేసీఆర్‌ కిట్ల పంపిణీ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల సరైన సేవలు అందించలేకపోతున్నారు. అనేకచోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితో పాటు, కొత్త పోస్టులు మంజూరు చేసినా భర్తీ ఆలస్యం అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో వైద్యుల పదవీ విరమణ వయసు పెంచితే కొంత వరకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వైద్యుల పదవీ విరమణ వయసు పెంచడంపై వైద్య-ఆరోగ్య శాఖ అధికారులు అంతర్గత నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.