"హిత బోధ" జైలు ఖైదీల్లో మార్పు తీసుకువస్తుందా..?

SMTV Desk 2017-09-17 13:19:30  capturing prisoners, jail, workhouses, supreme court

ఆధునిక సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరుగుతున్న నేపధ్యంలో కారాగారాలలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలలో మార్పు తేవాలనే లక్ష్యంగా, చిద్రమవుతున్న వారి జీవితాలను పట్టించుకుని, వారి పరిస్థితులను మెరుగుపరచడానికి జైలు సంస్కరణలో భాగంగా ఖైదీలకు హితబోద చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ఉన్న ఖైదిలకు హితబోదించడం వల్ల వారిలో మార్పు వస్తుందా ? దీని వల్ల జరుగుతున్న నేరాలను అధిగమించ వచ్చా ? ఈ సంస్కరణలు చేపట్టడం వలన సమాజానికి చేకూరే ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది ? అసలు ఇది సాధ్యం అవుతుందా లేక మిగతా వాటిలాగే నిష్ప్రయోజకంగా మారుతుందా ? అనే ప్రశ్నలు సామాన్యుల ప్రజలకు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు....మొదటి సారి జైలుకు వచ్చిన ఖైదీలకు కౌన్సిలర్లు ద్వారా హితబోద చెప్పించడం, ఖైదిల కుటుంబాలకు సంబందించిన పిల్లలకు సరైన విద్యను అందించడం, ఖైది కుటుంబానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారికి తగిన నష్ట పరిహారం చెల్లించడం, జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి తగిన వైద్య సదుపాయాలు అందించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వీటిని అమలు చేయడం వలన ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకురావచ్చని తద్వారా నేర ప్రవృత్తి తగ్గించడమే కాకుండా క్షణికావేశంలో నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న నేరస్తుల కుటుంబాలకు ఆసరా లభిస్తుందనే ఆలోచనలతో ఈ సంస్కరణలకు బీజం పడింది. దీని వల్ల ఖైదీలు ఎటువంటి ఆత్మహత్యకు పాల్పడకుండా మరణాల సంఖ్య తగ్గించవచ్చు అని, వారి జీవితాలను మెరుగుపరుచవచ్చని, సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.