నగరంలో ఎల్ఈడీ వెలుగులు

SMTV Desk 2017-06-05 16:33:36  LED lights, O R R outer ring road

హైదరాబాద్, జూన్ 5 : నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు భాగ్యనగరానికి ఎల్ఈడీ లు మణిహారంగా మారిందని, దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలి పారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఓఆర్ఆర్ పై రూ.30 కోట్లతో 24.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను నానక్ రాంగూడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ దేశంలో ఏ నగరానికీ హైదరాబాద్ తరహా ఔటర్ రింగ్ రోడ్డు లేదన్నారు. చాలా ప్రాంతాల్లో ఓఆర్ఆర్ నిర్మాణాలు తలపెట్టినా భౌగోళిక, ఆర్ధిక పరిస్థితులు సహకరించక పూర్తి కాలేదని చెప్పారు. నగరంలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఓఆర్ఆర్ పై మొత్తం 1,858 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశామన్నారు. సర్వీస్ రోడ్లలో 6 మీటర్ల కు ఒకటి చొప్పున స్తంభాలకు, 20 మీటర్ల స్థంభాలకు 500 వాట్ల హై ఫోకస్ ఎల్ఈడీ లైట్లను, వీయూపీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో ఓఆర్ఆర్ నగరానికి మణిహారంగా మెరుస్తున్నదని వెల్లడించారు. ఈ లైట్లను జీఎస్ఎం బెస్ట్ ఆటోమేషన్ సిస్టం కు అనుసంధానం చేయడంతో ట్రాఫిక్ ఎక్కువగా లేనప్పుడు లైట్ల వెలుతురు 50 శాతం తగ్గుతుందన్నారు. తద్వారా కరెంటు వినియోగం కూడా 50 శాతం తగ్గుతుందని వివరించారు. వీటిని ఆన్ లైన్ ద్వారా ఎక్కడినుంచైనా నియంత్రించవచ్చు అన్నారు. ఏదైనా లోపంతో బల్బు వెలుగకపోయినా, మరే ఇతర సాంకేతిక సమస్య వచ్చినా సంబంధిత ఉద్యోగి సెల్ ఫోన్ కు మెసేజ్ వెళ్తుందన్నారు. దశలవారీగా ఓఆర్ఆర్ మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 169 కిలోమీటర్ల ఓఆర్ఆర్ లో ఇంకా 1.5 కి.మీలు పూర్తి కావాల్సి ఉన్నదని, మరికొన్ని రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు. కండ్లకోయ వద్ద అసంపూర్తిగా ఉన్న లీకేజీని పూర్తిచేసేందుకు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక చొరవతో ప్రణాళికలు రూపొందించారన్నారు. అతివేగం కారణంగా ఓఆర్ఆర్ పై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటిని నివారించేందుకు ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం లో భాగంగా రాచకొండ కమిషనరేట్ కు రూ.25 లక్షలు, సైబరాబాద్ కమిషనరేట్ కు రూ. 53 లక్షలు కేటాయించామన్నారు. ఈ నిధులతో లేజర్ గన్స్, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. జూలై చివరి నాటికి ఓఆర్ఆర్ పై టోల్ సిస్టం ఆన్ లైన్ చేస్తామన్నారు. ఆన్ లైన్ స్మార్ట్ కార్డు, ప్రీపెయిడ్ సిస్టం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమెల్యే అరికేపూడి గాంధీ, హెచ్ ఎం డీ ఏ కమిషనర్ చిరంజీవులు, మున్సిపల్ శాఖ ముఖ్య కమిషనరు నవీన్ మీట్టల్ కార్పోరేటర్ సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.