రెవెన్యూ సేవలన్ని తాత్కాలికంగా బంద్... ఎందుకంటే..?

SMTV Desk 2017-09-14 12:22:37  revenue department, Update / clarification work, Revenue services will be temporarily banned.

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : మీకు రెవెన్యూ శాఖలో ఏమైనా పనుందా? అయితే వెంటనే పనులు పూర్తి చేసుకోండి. లేదంటే 100 రోజుల వరకు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటారా.! రెవెన్యూ రికార్డుల నవీకరణలో భాగంగా రెవెన్యూ సేవలన్నీ తాత్కాలికంగా బంద్‌ చేయనున్నారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం "మీ సేవ" కేంద్రాల నుండి రెవెన్యూ శాఖ 80 రకాల సేవలు అందిస్తోంది. ప్రతిరోజు కుల, ఆదాయ, స్థానిక, అడంగల్‌ పహాణీలు, ల్యాండ్‌ కన్వర్షన్‌, లేట్‌ రిజిస్ట్రేషన్‌, బర్త్‌, డెత్‌, ఈ-పాస్‌ పుస్తకాలు, కాస్రా పహాణీ, చేసాల పహాణీ, పైసల్‌ పట్టి, రుణ అర్హత కార్డులు, సినిమా లైసెన్సుల రెన్యువళ్ళు, ఓఆర్‌సీ, బోరు బావుల అనుమతులు, అడంగల్‌ కరెక్షన్‌ తదితర సేవలను తహశీల్దార్‌ కార్యాలయాలు /ఆర్డీవో/ కలెక్టరేట్ల ద్వారా జారీ చేస్తున్నారు. అయితే ఈ నెల 15 వ తేదీ నుండి డిసెంబరు 31వ తేదీ వరకు హైదరాబాద్‌ మినహా 30 కలెక్టరేట్లు, 66 రెవెన్యూ డివిజన్లు (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కాకుండా), 568 తహశీల్దార్‌ కార్యాలయాల్లో (హైదరాబాద్‌ జిల్లాలోని 16 మండలాలు తప్పించి) ఈ సేవలు స్తంభించనున్నాయి. తొలిసారిగా 20 ఏళ్లలో రెవెన్యూ రికార్డుల నవీకరణ చేపట్టనుండడంతో ఇది పూర్తయ్యేదాకా ఇతర పనులేవీ ముట్టుకోవద్దని ముఖ్యమంత్రితోపాటు పలువురు సంబంధిత అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిర్ణీత వ్యవధిలో జారీ చేయాల్సి ఉన్నా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సంఖ్య 33,48,336లకు చేరింది. గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి అధికారులను పరుగులు పెట్టించేవారు. ప్రస్తుతం ఆ విధానాన్ని స్వస్తీ పలుకుతూ నవీకరణ దిశగా ప్రభుత్వం పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ తహశీల్దార్‌ వరకు ప్రతి ఒక్క అధికారి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోనే బస చేయనుండడంతో రెవెన్యూ సేవలను అందించే వీలు లేకుండా పోతోందని అధికారులు వెల్లడించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మీసేవ ద్వారానే సేవలన్ని అందుతున్నప్పటికీ చివరికి ఆమోద ముద్ర వేయాల్సింది మాత్రం రెవెన్యూ శాఖనే కాబట్టి ఇప్పుడు రెవెన్యూ శాఖ అధికారులందరూ గ్రామాల బాట పట్టడంతో చాలా వరకు పనులన్నీ పెండింగ్ లోనే ఉండనున్నాయి. ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో వేచి చూద్దాం.