1 నుండి 12వ తరగతి వరకు ఖచ్చితంగా పాటించాలి : కేసీఆర్‌

SMTV Desk 2017-09-13 10:46:05  telugu language, world telugu summit hyderabad, talangana schools telugu language

హైదరాబాద్ సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు భాష అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ నేపధ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కోరుకున్న విద్యార్థులకు ఉర్దూభాష కూడా ఐచ్ఛికంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ నామఫలకాలను కచ్చితంగా తెలుగులోనే రాయాలన్నారు. మొదట స్పష్టంగా తెలుగులో ఉండాలని, ఆ తర్వాత ఇతర భాషలు రాసుకోవచ్చని తెలియజేసారు. ప్రపంచ తెలుగు మహాసభలపై ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానిస్తామని.. రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుతామని తెలిపారు.