రూ. 200 నోటు వచ్చింది మరి రూ. 100 సంగతేంటి?

SMTV Desk 2017-09-13 10:22:45  hundred rupees coin, rbi hundred rupees coin, mg ramachandhran, ms subbalakshmi

న్యూఢిల్లీ సెప్టెంబర్ 13: కేంద్ర ఆర్ధిక శాఖ త్వరలో రూ.100 నాణేలను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. కొత్తగా మార్కెట్ లోకి రానున్న రూ.100 నాణెం వ్యాసం 44 మిల్లిమీటర్లుగా, బరువు 35 గ్రాములు కలిగి ఉంటుందని, ఈ నాణేన్ని త‌యారు చేయడానికి 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రముఖ సినీ నటుడు ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు ఎం.జీ రామచంద్రన్, ప్రముఖ గాయని సంగీత విద్వాంసురాలు ఎం.స్ సుబ్బులక్ష్మిల జ్ఞాపకార్ధం వారి 100వ జన్మదినం సందర్భంగా ఈ నాణేలను ముద్రిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొన్ని నాణేలకు ఎం.జీ.ఆర్.బొమ్మతో, మరికొన్నింటిని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బొమ్మను నాణెం వెనుక భాగంలో ముద్రిస్తామని తెలిపింది. అలాగే నాణెం ముందు వైపు భాగంలో నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ ఉంటుందని వివరించింది. ఈ రూ.100 నాణేల ముద్రణతో పాటు, కొత్తవి రూ.5, రూ.10 నాణాలు ముద్రిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. వీటిలో రూ.10 నాణెం మీద సుబ్బులక్ష్మి బొమ్మను, రూ.5 నాణ్యం మీద ఎం.జీ.ఆర్ బొమ్మను ముద్రిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వాన్నిఎంజీ రామచంద్రన్‌ జయంతి సందర్భంగా కాయిన్స్‌, పోస్టల్‌ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.