నాలుగవ పెళ్లిని ఆపిన మూడవ భార్య..

SMTV Desk 2017-09-12 14:19:04   fourth marriage, tamilnadu, chennai, thanikachalm,

తమిళనాడు, సెప్టెంబర్ 12: తమిళనాడులో మరో నిత్య పెళ్ళికొడుకు ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తనికాచలం నగర్ కు చెందిన నందకుమార్ (34) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని వివాహం కోసపేటకు చెందిన విజయలక్ష్మి (30) అనే యువతితో నిశ్చయమైంది. ఆదివారం నాడు పెరంబూరు నుంచి సిరువళ్లూరు వెళ్లే రహదారిలో ఉన్న ఓ కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ, కొళత్తూరుకు చెందిన ఉష మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. అసలు ఉష ఎవరని...వివరాల్లోకి వెళ్తే...తన భర్త నందకుమార్ ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని, ఇప్పుడు తనకు కూడా అన్యాయం చేస్తూ, నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడని గొడవ పెట్టుకుంది. దీంతో తన భర్త నిర్వాకంపై సెబియం పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని వెంటబెట్టుకుని వచ్చి పెళ్లిని ఆపేసింది. పోలీసుల దర్యాప్తులో.... తాను ఓ రైల్వే ఉద్యోగిని అని చెప్పిన నందకుమార్ పలువురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచామని వెల్లడించారు.