చరిత్ర సృష్టించే ప్రయోగానికి ఇస్రో సిద్ధం

SMTV Desk 2017-06-05 13:39:31  isro, mark 3d1, zeesate-19,satilite

హైదరాబాద్, జూన్ 5 : ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ రాకెట్ జియో సిక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్ వీ) మార్క్-3డీ1 ప్రయోగానికి కౌంట్ డౌన్ మెుదలైంది. నాలుగుటన్నుల ఈ అంతరిక్ష వాహక నౌకను సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఆంధ్రప్రదేస్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం 3:58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగికెగిరే ఈ రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్ ఎల్ వీ మార్క్3-డీ1 ప్రయోగం 16 నిమిషాల 20 సెకన్లలో పూర్తికానుంది. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. 200 పెద్ద ఏనుగుల బరువుతో సమామైన జీఎస్ఎల్ వీ మార్క్-3 వాహన నౌక దేశీయంగా తయారైన అత్యంత భారీ రాకెట్. ఇప్పటి వరకు ఎస్ ఎల్ వీ, ఏఎస్ఎల్ వీ, పీఎస్ఎల్ వీ, జీఎస్ఎల్ వీ రాకెట్లను మాత్రమే ప్రయోగించిన ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్క్3-డీ1 భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది. దశాబ్దాల శ్రమ, 18 ఏండ్ల ప్రయోగాల ఫలితమే మార్క్-3 అంతరిక్ష వాహక నౌక. ఇందుకోసం ఇప్పటివరకు 300 కోట్లు వెచ్చించింది. ఈ సారి 25 టన్నుల క్రయోజనిక్ ఇంజిన్ తో పూర్తిస్థాయి ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది. దీని ద్వారా ఐదు టన్నుల బరువున్న ఉపగ్రహాలను సైతం కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. వ్యోమనాట్ ల రోదసీ యానం పై మార్క్ 3 ప్రయోగం కొత్త ఆశలు చిగురింపజేయనున్నది. ప్రస్తుత ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా 3136 కిలోల బరువున్న జీశాట్-19 ను రోదసిలోకి పంపనున్నారు. భారత్ తన సొంతగడ్డమీది నుండి తొలిసారి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే కావడం విశేషం. మూడు దశల్లో జరిగే ఈ ప్రయోగంలో జీశాట్-19 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమిటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడుతారు.ఈ ఉపగ్రహం రోదసిలో పదేండ్ల పాటు సేవలందిస్తుంది. దీని ద్వారా ఉపగ్రహ సామర్ధ్యాన్ని ఇస్రో రెట్టింపు చేసుకున్నట్లే. ఇంతకు ముందు 2.3 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఏకంగా ఐదు టన్నుల బరువున్న ఉపగ్రహాలనూ దేశీయంగానే పంపుకొనేలా మనం స్వయం సమృద్ధి సాధించామని ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. భారత సాంకేతిక వ్యవస్థను మలుపుతిప్పే ఉపగ్రహం కానుంది. రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్ ఇది. గతంలో మనం ప్రయోగించిన ఆరు, ఏడు ఉపగ్రహాలతో ఇది సమా నమైందని అంతరిక్ష పరిశీలనా కేంద్రం డైరెక్టర్ తపన్ మిశ్రా వెల్లడించారు. ప్రస్తుతం 41 కక్ష్యా ఉపగ్రహాల్లో 13 సమాచార వ్యవస్థకు సంబంధించినవని, వాటికి అదనంగా చేరనున్న జీశాట్-19 డిజిటల్ ఇండి యా స్పూర్తితో రూపొందించిందని వివరించారు.