ఫిర్యాదు చేస్తే మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటా...

SMTV Desk 2017-09-12 12:28:46  IT Company, Hyderabad, Software jobs, Fresher Jobs

హైదరాబాద్‌, సెప్టెంబర్ 12: గత కొన్ని రోజులుగా వింటూనే ఉంటున్నాం నకిలీ కంపెనీల బాగోతాలు. దేశంలో ఉన్న నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని శిక్షణ అనంతరం కొలువులిస్తామని చాలా సంస్థలు వస్తూనే ఉన్నాయి. మోసాలు చేస్తునే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఒక బోగస్‌ ఐటీ కంపెనీ ఉద్యోగార్థులకు టోపీ పెట్టి బోర్డు తిప్పేసింది. వివరాల్లోకి వెళ్తే... అబ్దుల్‌ వసీమ్‌ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం గచ్చిబౌలిలోని సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ భవనంలో రిచీస్‌ ఐటీ ఇన్ఫోటెక్‌ పేరుతో సంస్థని ప్రారంభించాడు. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌కు 2 నెలలు శిక్షణను, ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.60వేలు డిపాజిట్‌ చొప్పున 25 మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. మరో 22 మంది సీనియర్లను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. ఇంతవరకు వసీమ్‌ ఫ్రెషర్స్‌కు ఎలాంటి జీతం ఇవ్వకపోగా, సీనియర్‌ ఉద్యోగులకు ఒక నెల జీతం ఇచ్చి ఇదిగో అదిగో అంటూ ఆరు నెలల నుండి వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో ఉద్యోగులు జీతాల కోసం ఒత్తిడి చేయడంతో ఆగస్టు 1న కొంతమంది ఉద్యోగులకు 15వ తేదీతో వేసిన చెక్కులను ఇచ్చాడు. చెక్కులను కొందరు ఉద్యోగులు బ్యాంకులో వేయగా ఖాతాలో నిధులు లేకపోవడంతో బౌన్స్‌ అయ్యాయి. దీనిపై వసీమ్‌ను నిలదీసిన ఉద్యోగులకు ఇదిగో అదిగో అంటు వారం రోజుల క్రితం నుండి అదృశ్యమయ్యాడు. ఉద్యోగులు యధావిధిగా కార్యాలయానికి వెళితే, వసిం బిల్డింగ్‌ అద్దె చెల్లించలేదని అందుకనే కార్యాలయానికి తాళం వేసినట్లు, కాంప్లెక్స్ యజమాని చెప్పడంతో ఉద్యోగులు తాము మోసపోయామని గ్రహించి వసీమ్‌పై ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం ఉద్యోగులకు కంపెనీ నిర్వాహకుడు వసీమ్‌ ఫోన్‌ చేసి మీరు పోలీసులకు నాపై ఫిర్యాదు చేస్తే మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ నేపధ్యంలో తాము పనిచేసిన కాలానికి జీతం డబ్బులు ఇవ్వాలని కొందరు, జీతం ఇవ్వక పోయినా కనీసం తమ వద్ద తీసుకున్న డిపాజిట్‌ డబ్బులు వెనక్కు ఇప్పించాలని మరికొందరు ఉద్యోగులు సోమవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.