ఒంటరి మహిళలకు జీవనభృతి

SMTV Desk 2017-06-05 12:57:43  ontari mahila, telangana, ontari mahila pension scheeme

హైదరాబాద్, జూన్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం ఆదివారం ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 150 కేంద్రాలలో మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 8వేల 302 మంది మహిళా లబ్ధిదారులకు జీవనభృతి ధ్రువపత్రాలను పంపిణి చేశారు. పథకం ద్వారా లబ్దిదారులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి చెల్లిస్తారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చినా రాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంగా అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ నుండి ప్రారంభమయినందున ఏప్రిల్, మే రెండు నెలల భృతి కలిపి రెండువేల రూపాయల మెుత్తాన్ని లబ్దిదారుల ఖాతాలలో జమచేశారు. వచ్చే నెల నుంచి ఏనెల భృతి డబ్బులు ఆ నెల చివరినాటికి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందజేసేలా పేదరిక నిర్మూలనా సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు విధించలేదు..అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను అందించాలన్న ప్రభుత్వ విధానం మేరకు భృతి మంజూరు ప్రక్రియను నిరంతరం కొనసాగించనున్నారు. సమాజంలో ఏ దిక్కూ లేకుండా జీవిస్తున్న అసహాయులైన ఒంటరి మహిళల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణాన్ని అసాధారణ రీతిలో ఆవిష్కరించింది. పేదరికంలో మగ్గిపోతున్న ఆడబిడ్డలకు నెలకు వెయ్యిరూపాయల జీవనభృతిని అందించి అండగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలో ఒంటరి మహిళకోసం ఈ స్థాయిలో సంక్షేమ పథకం అమలు జరుగడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ పథకాన్ని పకడ్బందీగా రూపొందించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మెుదటి నుంచీ ఆడబిడ్డలకే పెద్దపీట వేస్తున్నది. కల్యాణలక్ష్మీ, బీడికార్మికులకు భృతి, వితంతువుల పింఛన్ వంటి అనేక పథకాలకు తోడుగా జూన్ 2 న కేసీఆర్ కిట్ పేరుతో తల్లిబిడ్డల ఆరోగ్య రక్షణ కోసం పథకం ప్రారంభించారు. తాజాగా ఆదివారం ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం అమలులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మెుట్టమెుదటి క్యాబినెట్ సమావేశంలో ప్రారంభించిన బీడి కార్మికులకు జీవనభృతి నుంచి నేటి ఒంటరి మహిళలకు భృతి వరకు అన్నింటా మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో 150 చోట్ల రాష్ట్ర మంత్రులు మెుదలు స్థానిక నేతల దాకా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణి చేశారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ పౌసమి బసుతో కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి సుకన్య అనే మహిళకు తొలి ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో, గద్వాల జిల్లా కేంద్రంతో పాటు ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో కుడా ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతు ఒంటరి మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని పిలుపు నిచ్చారు. ఏ తోడు లేని ఒంటరి మహిళలకు ప్రభుత్వమే పెద్దన్నలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆడబిడ్డలందరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. దేశ చరిత్రలో కాని, రాష్ట్రాల చరిత్రలో కాని ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలను తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ ఘనత సాధించారని వివరించా రు. 40వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హైదరాబాద్ మలక్ పేట్, చార్మినార్, అంబర్ పేట, సైదాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ జీవన భృతి మంజురు పత్రాలు పంపిణి చేశారు. సిద్ధిపేటలో నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు, కరీంనగర్ జిల్లాలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మెదక్ జిల్లాలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్, లాలాపేట లో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, నిర్మల్ జిల్లాలో గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ మంత్రి జోగురామన్న, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబ్ గర్ జిల్లా బాలానగర్, జడ్చర్ల, నవాబ్ పేట మండలాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించి ధృవపత్రాలను పంపిణి చేశారు.