సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు

SMTV Desk 2017-09-10 19:32:21  AP CM Chandrababu, Amravati Secretariat, Ministerial Meeting

విజయవాడ, సెప్టెంబర్ 10 : అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం దాదాపు 5 గంటల పాటు జరిగింది. అజెండా అంశాలతో ప్రజల సమస్యలపై మంత్రి వర్గంలో కీలక చర్చ జరిగింది. ఇసుక ఉచితంగా ఇస్తున్న దందాలు కొనసాగుతున్నప్పటికి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో పాటు మంత్రులంతా ఇసుకరీచుల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరి వల్ల కాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను మరింత కట్టడి చేయాలని తేల్చి చెప్పారు. రానున్న 15 రోజుల్లోగా పరిస్థితిని అదుపు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి తప్పు పట్టారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్న శాఖ తీరు మెరుగు పడడం లేదని ఆక్షేపించారు. అనధికార వ్యవసాయ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గంలో నిర్ణయించారు. అనుమతులు తక్షణం రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు ఏపీఐఎసీ ప్రతిపాదించే భూమి తెరలపై మంత్రి వర్గంలో చర్చ జరిగింది. హైదరాబాద్ కు మించిన స్థాయిలో ధరలను ప్రతిపాదించడం పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఇచ్చే భూములు పట్టుబడులను ప్రోత్సహించేలా ఉండాలని సూచించారు. అగ్రిగోల్డ్ అంశంపైన మంత్రి వర్గంలో కీలకంగా చర్చించారు. అగ్రీగోల్డ్ భూములను కొనుగోలు చేసేందుకు పారిశ్రామికవేత్త జీ గ్రూప్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్ర ముందుకు వచ్చారన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సుభాష్ చంద్ర సాధ్యాలను పరిశీలించాలని కోరారు. మంత్రివర్గ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మంత్రులు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు పని తీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తామని సీఎం తెలిపారు. అప్పటికప్పుడు పని తీరును సమీక్షిస్తామని ఆయన వెల్లడించారు.