ప్రేయసిని నదిలోకి తోసిన ప్రియుడు

SMTV Desk 2017-06-05 10:48:57  yanam, gouthami godavari, rajamandri, aliveni, srinivas

యానాం, జూన్ 5 : పెళ్లి చేసుకోవాలని విసిగిస్తుందని ఆగ్రహించిన ప్రియుడు ఆమెను ఏకంగా గోదావరి నదిలోకి తోసి పరారయ్యాడు. ఆ సమీపంలో ఉన్న మత్స్యకారులు గుర్తించి వెంటనే నదిలోకి దూకి ఆమెను రక్షించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమె యానాం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గండి అలివేణి (26), అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గత ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్న వారు పెళ్ళితో ప్రేమకథకు సుఖాంతం పలుకుదాం అనుకున్నారు. అయితే ఇదే విషయమై అలివేణి పలుమార్లు శ్రీనివాస్ కు సూచించింది. పెళ్ళి చేసుకుందామని తరుచు ఒత్తిడి చేస్తున్నది. ఒత్తిడి తీవ్రమవడంతో ఆమెను శ్రీనివాస్ ఆదివారం యానాం తీసుకువచ్చాడు. వారు యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వంతెనపై కొద్దిసేపు గడిపారు.పెళ్ళి విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ప్రియుడు శ్రీనివాస్ ఆమె తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుండి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె చరవాణి, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. యానాం ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.