ప్రాణంతోనే ఉన్నా, చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు

SMTV Desk 2017-06-04 17:54:32  praivate hospatal, gandhi, deth, farid

హైదరాబాద్, జూన్‌ 4 : ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల వ్యవహారం తీవ్ర విస్మయానికి, ఆందోళనకు గురిచేసింది. రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కొన్నాళ్లు చికిత్స నిర్వహించిన వైద్యులు .. చనిపో యాడు తీసుకెళ్లండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రాణాలు పోయాయనుకున్నకుటుంబ సభ్యులు భోరున ఏడుస్తు శవాన్ని ఇంటికి తరలించారు. అయితే శవం అనుకొని ఇంటికి తెచ్చినప్పటికి శరీరంలో కదలికలను గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. తిరుమలగిరికి చెందిన నయూం కుమారుడు ఫరీద్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వారం క్రితం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కెట్ యార్డు మీదుగా బైకుపై వెళ్తుండగా ఎరురుగా వచ్చిన యాక్టివా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యానికి దాదాపు నాలుగు లక్షలు ఖర్చయిందని..తీరా శనివారం బ్రెయిన డెడ్ అయిందని చెప్పిన కొద్దిసేపటికే ఫరీద్ చనిపోయాడని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబీకులు వివరించారు. ఫరీద్ శరీరంలో కదలికలు ఏర్పడటంతో వెంటనే గాంధీ ఆస్పత్రిలోని పోస్టు ఆపరేటివ్ వార్డులో చేర్పించారు.జరిగిన విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ 2 డాక్టర్ సల్మాన్ ఫరీద్ కు ప్రత్యేక వైద్యం అందించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న ఫరీద్ కు డాక్టర్ సాల్మన్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.