జీ.వో నెం.64 రద్దు..పవన్ కళ్యాణ్ హర్షం...!

SMTV Desk 2017-09-07 16:35:45  pavan kalyan, janasena, tdp, bjp, ap politics, special status

హైదరాబాద్ సెప్టెంబర్ 7: గుర్తింపులేని కళాశాలల్లో అగ్రికల్చర్ బీ.ఎస్సీ (ఏజీబీయస్సి) చదివిన విద్యార్దులు వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అర్హత కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీ వో నెం.64 రద్దు చేయాలని అన్ని వ్యవసాయ కళాశాలల విద్యార్దులు తరగతులు బహిష్కరించి ఉద్యమాల ద్వారా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇటివలే హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని కూడా ఈ విషయమై వ్యవసాయ కళాశాల విద్యార్ధులు కలసి 64ను రద్దు చేయించేలా ప్రభుత్వంతో చర్చించాలని కోరుతూ తమ సమస్యలను విన్నవించారు. ఇంత వరకూ ప్రభుత్వం తరపున చేపట్టే రిక్రూట్ మెంట్ లో భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) గుర్తింపు ఉన్న కాలేజీల్లో చదివి ఉండాలి అనే నిబంధన ఉండేది. అలాంటిది ఈ జీ.వో నెం.64 ద్వారా గుర్తింపు లేని కళాశాలలో చదివిన విద్యార్దులు కూడా ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగాలకు అర్హత లభించినట్లైంది. ఈ జీవోపై పున‌రాలోచించిన‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబ‌ర్ 64ను ర‌ద్దు చేసింది. ఈ మేరకు సచివాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలలకు సంబంధించి ఎప్పటిలాగే జీవో 16 అమలులో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థుల వినతి మేరకు జీవో 64ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని పై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం జీవో నెంబ‌రు 64ను ర‌ద్దు చేసినందుకు సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్ధులు ఆధునిక వ్యవసాయ పద్దతుల గురించి రైతులకు తెలియజేస్తూ వ్యవసాయ రంగం నందు దేశ అభివృధిలో భాగస్వాములు కావాలని పవన్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.