రాజకీయ నేత‌ల ఆస్తుల వృద్ధిపై సుప్రీంకోర్టు దృష్టి

SMTV Desk 2017-09-07 15:06:52  Supreme Court, Central, The growth of assets of 289 people, Justice J. CHALAMESHAVAR, JUSTICE S. Abdul Nazir

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07 : ప్రస్తుత సుప్రీంకోర్టు నిఘా మొత్తం రాజకీయ నేతల ఆస్తులపైనే. ప‌దవిలో ఉన్న ఐదేళ్ల కాలంలోనే రాజ‌కీయ నేత‌ల ఆస్తుల్లో ఆక‌స్మిక వృద్ధిరేటు క‌నిపించ‌డంపై స‌మాధానం తెలియ‌జేయాల‌ని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 289 మంది నేత‌ల‌ ఆస్తుల వృద్ధి మీద ఎలాంటి చర్య ఎందుకు తీసుకోలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. సుప్రీం వ‌ద్ద ఉన్న 289 మంది నేత‌ల వివరాల్లో ఐదేళ్ల కాలంలోనే ఒక్కొక్క‌రి ఆస్తుల విలువ 500 శాతం వ‌ర‌కు వృద్ధి చెందిన‌ట్లు సమాచారం. ఈ వృద్ధి చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌నుల వ‌ల్లే క‌లిగిందా? లేక ఏదైనా అవినీతి చర్యల వ‌ల్ల క‌లిగిందా? అనే అంశంపై వారం లోగా నివేదిక ఇవ్వాల‌ని జ‌స్టిస్ జె. చ‌ల‌మేశ్వ‌ర్‌, జ‌స్టిస్ ఎస్. అబ్దుల్ న‌జీర్‌ల ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ఆదేశించింది. జూన్ 2015లో ఆస్తుల్లో ఆక‌స్మిక వృద్ధి క‌నిపించిన రాజ‌కీయ నాయ‌కుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఓ స్వ‌చ్ఛంద సంస్థ, సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కి విన్న‌వించుకుంద‌ని, ఆ విన్న‌పం మేర‌కు సీబీడీటీ ఇచ్చిన స‌మాధానాలు స‌రిగా లేవ‌ని సుప్రీంకోర్టు వెల్లడించింది.