భవిష్యత్తుకు అందించాలి : మోదీ

SMTV Desk 2017-06-04 15:57:04  modi,immaniual micron, france president, indian pm

పారిస్, జూన్‌ 4 : సహజ వనరులను అవసరానికి ఉపయోగించుకొని.. కాలుష్యం లేకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని, భవిష్యత్ తరాల కోసమై కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని దేశ ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ నూతన అధ్యక్షులు ఇమాన్యుయెల్ మేక్రాన్ తో సమావేశమై ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.అనంతరం మీడియా సమా వేశంలో ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో తాము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండడమే కాకుండా, ఒప్పందానికి మించి తమ బాధ్యత నెరవేరుస్తామని హామి ఇచ్చారు. భారత్ ప్రకృతి, పర్యావరణాన్ని ఆరాధించే దేశమని..తమ దేశ ప్రజల జీవన విధానంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణ సూత్రం ఇమిడి ఉంటుందని స్పష్టం చేశారు. భూమిని, సహజ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత, ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం, భవిష్యత్ తరాలకు ఇది క్షేమకరం. మన పూర్వికులు సహజ వనరులను కాపాడినందుకే మనకు ఈ వనరులు అందుబాటులో ఉన్నాయి..మన భవిష్యత్ తరాల కోసం కుడా ఇదే వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ప్రపంచానికి పెనుసవాలుగా మారిన ఉగ్రవాదం పై పోరులో భారత్,ఫ్రాన్స్ కలిసి పనిచేయనున్నాయని ప్రధాని వివరించారు. ఫ్రాన్స్ కు ఉగ్రసమస్య ఎక్కువగా ఉందని..వారికి కూడా ఉగ్రవాదం వల్ల కలిగే బాధేంటో తెలుసన్నారు. ప్రపంచమంతా ఉగ్రపోరాటంలో ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన మిత్రత్వం కారణంగా ఇరుదేశాలు చాలాకాలంగా కలిసి పని చేస్తున్నాయని..ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలపైనా సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని వివరించారు. వాణిజ్యమైనా, సాంకేతిక, సృజనాత్మకత, పెట్టుబడులు, శక్తి, విద్య ఇలా అన్ని రంగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాలు మరింత బలోపేతం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు నేతలు ఇద్దరు ఆసక్తి చూపారు. మేక్రాన్ ను భారత పర్యటనకు ఆహ్వానించారు.