అందరినీ షాక్ కు గురి చేస్తున్న మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య.. అసలేం జరిగింది..?

SMTV Desk 2017-09-06 18:06:22  gouri lankesh, journalist gouri lankesh, national news

కర్ణాటక సెప్టెంబర్ 6: సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలికితీసే క్రమంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి మన దేశంలో దాపురించడం ప్రజాస్వామ్యం అనే పదానికే సిగ్గు చేటు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు విధి నిర్వాహణలో భాగంగా తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. న్యాయానికి సమాజంలో చోటు లేనప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే పదానికి అర్థమే లేదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. న్యాయమే శ్వాసగా, ధర్మమే ధ్యాసగా పని చేస్తున్న జర్నలిస్టులు రౌడీయిజం కోరల్లో చిక్కుకొని ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈమె హత్య వెనకాల కారకులు, కారణాలు ఇంకా బయటకు రాలేదు కానీ అన్యాయాన్ని వెలికి తీసే క్రమంలోనే ఆమె ప్రాణాలను కోల్పోయిందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంటి ముందు కారును పార్క్‌ చేసి తలుపులు తెరుస్తుండగానే, బైక్‌పై వచ్చిన దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఏడు రౌండ్ల కాల్పుల్లో నాలుగు ఇంటి ప్రహరీ గోడకు తగలగా మరో మూడు బుల్లెట్లు ఆమె తల, ఛాతీలోకి చొచ్చుకుపోవడంతో మరణించారు. కన్నడ పత్రిక ‘గౌరీ లంకేశ్‌ పత్రికె’కు ఈమె ఎడిటర్‌. పలు పబ్లికేషన్లనూ నిర్వహిస్తున్నారు. తనపై ఎవరెన్ని కేసులు పెట్టినా వెరవని సాహసోపేత జర్నలిస్టుగా, సామాజిక వేత్తగా గౌరీ శంకర్‌ సుప్రసిద్ధురాలు. ఇలాంటి సంఘటనలు ఏటా జరుగుతున్నా ప్రభుత్వం ఖండిస్తుంది తప్పితే నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జర్నలిస్టులను హత్య చేయడం అంటే ప్రజాస్వామాన్ని కలరాయడమే అని సామాజిక వేత్తలు అభిప్రాయ పడుతున్న తరుణంలో వీటి నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.