అమెరికాకు సంభవించనున్న మరొక తుఫాను..

SMTV Desk 2017-09-06 17:23:58  Irma, Hurricane Harvey Storm, Washington

వాషింగ్టన్‌, సెప్టెంబర్ 06 : నిన్నటి వరకు హరికేన్‌ హర్వే తుఫాను వణికించిన తీరును అమెరికా వాసులు మరవక ముందే మరోక తీవ్ర ప్రభావం చూపే భారీ హరికేన్‌తుఫాను ముంచుకొచ్చింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలోనే అతి భారీ తుపానుగా పేర్కొంటున్న ఇర్మా ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోందట. కరేబియన్‌ దీవుల్లోని బార్బుడా ప్రాంతంలో ఇది మొదటగా తీరాన్ని తాకింది. ఈ తుపాను వేగం గంటకు 360 కిలోమీటర్లతో తీవ్ర గాలులు వీస్తున్నాయి. ఇది ఫ్లోరిడా తీరాన్ని ఈ వారాంతంలో తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ హరికేన్‌ తీవ్రతను పరిశీలించడానికి వాతావరణ విభాగానికి చెందిన ఎన్‌ఓఏఏ42 విమానం నుంచి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దృశ్యాలను చూస్తే ఇర్మా తీవ్రత ఎంతో అర్థమవుతుంది. బార్బుడా ప్రాంతంలో తీరాన్ని తాకే ముందు విమానం నుంచి ఈ వీడియోను తీశారట.. విమానంలో వాతావరణ వివరాలను చూపిస్తున్న పలు కంప్యూటర్‌ స్క్రీన్లను మొదటగా చూపించారు. ఆ తర్వాత విమానం కిటికీలోంచి ఇర్మా అల్లకల్లోలం సృష్టిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను ట్విటర్‌లో పెట్టిన 12 గంటల లోపే 3,500 రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంత భయనకంతో ఉంటున్నారు.