సగ్గుబియ్యంలో విషం! మిక్సింగ్‌తో మొదటికే మోసం

SMTV Desk 2017-06-04 15:18:42  sago, Adulteration, Poison,

కాకినాడ, జూన్‌ 4 : సగ్గుబియ్యం కలిపిన సేమ్యా చూపులకే తీయగా నోరూరిస్తుంది. అలాంటి సగ్గుబియ్యం తయారీలో కల్తీచేసి, నోరు పట్టలేనంత విష మయం చేస్తున్నారు కొందరు మిల్లర్లు. పెరిగిన డిమాండ్‌ని సొమ్ము చేసుకొనేందుకు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని మిల్లులు.. కర్రపెండలంలో మొక్కజొన్నని కలిపి సగ్గుబియ్యం తయారుచేస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అధికారులు, రైతులే వచ్చి ఫిర్యాదు చేస్తు న్నా కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాలు సగ్గుబియ్యం తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి సగ్గుబియ్యానికి ఒడిశా, బెంగాల్‌లలో మంచి డిమాండ్‌ ఉంది. తీపిని ఇష్టపడే ఒడిస్సీ, బెంగాలీలు...పిండివంటల్లో సగ్గుబియ్యంని ఎక్కువగా వాడతారు. సగ్గుబియ్యం తయారీకి మిల్లర్లు కర్రపెండలం దుంపలను వాడతారు. దీనివల్ల ఎంతకాలం వంటింట్లో నిల్వ ఉంచుకొన్నా, సగ్గుబియ్యం పాడవదు. పైగా మంచి రంగు తేలుతుంది. జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల రైతులకు కర్ర పెండలమే తిండి పెడుతోంది. వర్షాభావ పంట కావడంతోపాటు, మిల్లర్ల నుంచి మంచి డిమాండ్‌ ఉండటమూ ఎక్కువమంది రైతులకు బాగా కలిసి వస్తోంది. మిల్లర్ల అవసరాలకు గాను మొత్తం 16 మండలాల పరిధిలో యేటా 40వేల ఎకరాల్లో కర్ర పెండలం సాగు చేస్తున్నారు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురం, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, మేడపాడు, గోలివారికొత్తూరు, పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరు, రాయభూపాలపట్నం, జగ్గంపేట మండలం మల్లిశాల, తాళ్లూరు గ్రామాల్లో 30 వరకు సగ్గుబియ్యం మిల్లులు ఉన్నాయి. 90 కిలోల కర్ర పెండలం బస్తాని మిల్లర్లు రూ. ఐదు వేలకు కొని.. వ్యాపారాలను సాగిస్తున్నారు. దేశంలోని సగ్గుబియ్యం అవసరాలను చాలావరకు తమిళనాడులోని సేలం తీరుస్తుంది. అలాంటిది గత ఏడాది.. కల్తీ నిరోధక అధికారులు అక్కడి సగ్గుబియ్యం తయారీ మిల్లులను పెద్దఎత్తున మూసివేశారు. దాంతో ఒక్కసారిగా తూర్పు గోదావరి మిల్లర్లకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఇదే అదునుగా.. కొందరు మిల్లర్లు కల్తీలకు తెర తీశారు. కర్ర పెండలంతో పోల్చితే.. మొక్కజొన్న ధర తక్కువ. దీంతో కర్రపెండలంలో 30 నుంచి 40 శాతం మొక్కజొన్నని కలిపి..సగ్గుబియ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. రంగు కోసం వైట్నర్‌, కొంతమంది సర్ఫ పౌడర్‌ కలుపుతున్నారు. డిమాండ్‌ మేరకు, అందిన కాడికి, వచ్చిన రేటును కల్తీ సగ్గుబియ్యం అమ్మేయడం మొదలుపెట్టారు. కర్రపెండలంతో సగ్గుబియ్యం తయారుచేసే మిల్లర్లు.. ఇంత తక్కువ ధరకు అమ్మలేక, రేటు రాక తీవ్రంగా నష్టపోయారు. కల్తీ మిల్లర్ల ఆట కొంతకాలం బాగానే సాగింది. డిమాండ్‌ తగ్గుముఖం పడుతున్నకొద్దీ వారివద్ద సగ్గుబియ్యం నిల్వలు పెరిగిపోయాయి. దీంతో.. వారిలో ఆందోళన మొదలయింది. కారణం ఏమిటంటే, కల్తీ సగ్గు బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే.. చేదెక్కుతుంది. ఇంకా నిల్వ చేస్తే తినడానికి వీలులేనంతగా విషమయం అయిపోతుంది. ఇప్పుడు.. చేదెక్కిన సగ్గుబియ్యం బస్తాలు చాలా మిల్లుల్లో పేరుకుపోయి కనిపిస్తున్నాయి. మొక్కజొన్న వాడకం పెరిగితే తాము సాగు నుంచి తప్పుకోవాల్సిందేనని కర్రపెండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను తాము కాపాడుకోవడం కోసం కల్తీపై వారే నడుం కట్టారు. విజిలెన్స్‌ అధికారులను కలిసి, కొన్ని మిల్లులపై ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారుల్లో చలనం లేదని రైతులు మండిపడుతున్నారు. నిజానికి, సగ్గుబియ్యం తయారీలో కర్రపెండలానికి బదులు మొక్కజొన్న వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. 2006 కల్తీ నిరోధక చట్టం ప్రకారం జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అయితే, శిక్షలు తరువాత, కనీసం తనిఖీలకే అధికారులు మొగ్గు చూపడం లేదని రైతులు వాపోతున్నారు. సగ్గుబియ్యం కల్తీపై దృష్టి సారిస్తాం. మొక్కజొన్నతోపాటు ఏవేవి కలుపుతున్నారో పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను అప్రమత్తం చేస్తామని ఆహార నియంత్రణ అధికారి నాగేశ్వర రావు వెల్లడించారు.