ఇంటర్ టాపర్ నిర్వాకం ఇది

SMTV Desk 2017-06-04 14:57:48  bihar, topper, ganesh, 12th class topper

పాట్నా, జూన్ 4 : బీహార్‌ టాపర్ల కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షలు రాసిన 12వ తరగతి హ్యుమానిటీస్‌ విభాగం రాష్ట్ర టాపర్‌ గణేశ్‌ కుమార్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, గణేశ్‌ వయసు 41 ఏళ్లయితే.. 24ఏళ్లని చెప్పి పరీక్షలు రాసినట్లు బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు పోలీసులకు తెలిపింది. అంతేగాక, అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని బోర్డు పేర్కొంది. ఇవేవీ చెప్పకుండా నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షలు రాసినట్లు వెల్లడించింది. బోర్డు ఫిర్యాదు మేరకు శుక్రవారం గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు గణేశ్‌ ఫలితాన్ని కూడా రద్దు చేశారు. మీడియా ఇంటర్వ్యూ ద్వారా ఈ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. 12వ తరగతి ఫలితాల్లో గణేశ్‌ టాపర్‌గా నిలవడంతో మీడియా వర్గాలు అతడిని ప్రశ్నించాయి. మ్యూజిక్‌లో 70కి 65 మార్కులు సాధించిన గణేశ్‌.. మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ గురించి చెప్పమని అడిగితే.. మైథిలి కోకిల అని సమాధానమిచ్చాడు. ఇది విన్న సదరు రిపోర్టర్‌ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే మైథిలి కోకిల అనేది బీహార్‌లోని ఓ భాష. అంతేగాక, సమస్తిపూర్‌కు చెందిన శారద సిన్హా అనే జానపద గాయనిని మైథిలి కోకిలగా పిలుస్తారు. కాగా, సమస్తిపూర్‌లోని ఓ స్కూల్‌లోనే చదువుకున్నా శారద సిన్హా ఎవరో గణేష్‌కు తెలియకపోవడం గమనార్హం. ఇక సంగీతానికి సంబంధించిన బేసిక్స్‌ చెప్పమంటేనే గణేశ్‌ నోటి నుంచి మాటరాలేదు. మ్యూజిక్‌ ప్రాక్టికల్స్‌లో ఏం చేశావో చూపించమంటే బాలీవుడ్‌ చిత్రాల్లోని కొన్ని పాటలను అడ్డదిడ్డంగా పాడి వినిపించాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు అతని విషయంలో ఆరా తీయగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అసలు గణేశ్‌ది బీహార్‌ కాదని, అతడు జార్ఖండ్‌ రాష్ట్రం గిరిద్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల కిందట సమస్తిపూర్‌కు వచ్చాడు. చుట్టుపక్కల వారు చదువుకోమని ప్రోత్సహించడంతో ఆయన స్కూల్లో అడ్మిషన్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కూడా బీహార్‌లో ఓ యువతి ఇలానే టాపర్‌గా వచ్చి అరెస్టైన విషయం తెలిసిందే.