నంద్యాలపై చక్రం తిప్పిన అఖిలప్రియ

SMTV Desk 2017-06-04 14:41:06  nandyala, bi election, ministar bhuma akila priya,

కర్నూలు, జూన్ 4 : నంద్యాల ఉప ఎన్నిక విచిత్రమైన మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆ శాసనసభ సీటుకు ఎన్నిక జరగనుంది. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ఎన్నిక ఏకగ్రీవం కావడం దుర్లభమనిపించింది. అయితే, మంత్రి అఖిలప్రియ చక్రం తిప్పడంతో ఏకగ్రీవానికి పునాదులు పడినట్లు చెబుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించుకుని ఏకగ్రీవం చేసుకునేందుకు అఖిలప్రియ జోరుగానే రాజకీయం నడుపుతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబం నుంచి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. దానివల్ల ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ, టిడిపి టికెట్ కోసం శిల్పామోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపితే మాత్రం తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ తన చాతుర్యాన్నిప్రదర్శించినట్లు చెబుతున్నారు. నంద్యాల శాసనసభ టికెట్ గత సంప్రదాయం ప్రకారం భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని పోటీకి దింపి ఏకగ్రీవం చేసే సంప్రదాయం కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతూ వస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీ టికెట్ తనకు కావాలంటూ శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. దాంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. కల్పించుకున్న చంద్రబాబు నంద్యాల టికెట్‌పై భూమా, శిల్పా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపడంతో చంద్రబాబు కల్పించుకున్నారు. ఇరు వర్గాలతోనూ ఆయన చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు. దాంతో టికెట్ ఖరారు విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ టికెట్ శిల్పా మోహన్ రెడ్డికి ఇస్తే నంద్యాలలో తమ అభ్యర్థిని పోటీకి దించాలని జగన్ ఆలోచిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కూడా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గంగుల ప్రతాప రెడ్డి వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. దాంతో నంద్యాల టికెట్ ఆయనకు ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ స్థితిలోనంద్యాల వైసీపీ ఇన్‌ఛార్జ్‌ రాజగోపాల్‌రెడ్డి గొంతు పెంచారు. ఆయనకు జిల్లా వైసీపీ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి మద్దతు పలికారు. దీంతో గంగుల ప్రతాపరెడ్డి వర్గానికి చిక్కులు తలెత్తాయి. శిల్పా మోహన్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానంద రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. అఖిలప్రియకు భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరుడవుతారు. అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయాన అల్లుడు. దానివల్ల భూమా బ్రహ్మానందరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా కీలకంగా మారాడు. దీంతో బ్రహ్మానంద రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేందుకు కర్నూలు జిల్లా టీడీపీ, వైసీపీ నేతలు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మనందరెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రతిపాదనను మంత్రి అఖిలప్రియ వర్గానికి చెందిన నేతలు చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా బ్రదర్స్, బ్రహ్మనందరెడ్డి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ఏకగ్రీవం అయ్యే విషయంపై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పోటీ పెడతానని వైసీపి అధినేత జగన్ చెప్పిన నేపథ్యంలో ఏకగ్రీవం అనేది అంత సులభం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవాళ్లు ఏమంటారో చూడాలని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవం విషయంపై చంద్రబాబు సానుకూల వైఖరి వ్యక్తం చేయడంతో మంత్రి అఖిలప్రియ, కాటసాని రామిరెడ్డి ఈ విషయంపై రహస్య చర్చలకు తెరలేపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కాటసాని రామిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. పోటీ పడుతామని జగన్ ప్రకటించడంతో కాటసాని రామిరెడ్డి మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. భూమా బ్రహ్మానంద రెడ్డిని ఏకగ్రీవం చేసే విషయంపై కాటసాని రామిరెడ్డి జగన్ తల్లి విజయమ్మతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దానికి విజయమ్మ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై జగన్‌తో కూడా మాట్లాడి ఏ విషయమూ త్వరలో చెప్తానని వైయస్ విజయమ్మ చెప్పినట్లు సమాచారం. విజయమ్మ జగన్‌ను ఒప్పిస్తే నంద్యాల ఏకగ్రీవం కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. జగన్‌ను విజయమ్మ ఒప్పించగలుగుతారా అనేది ఇప్పుడు ప్రశ్న. భూమా బ్రహ్మానంద రెడ్డికైతే ఆయన అంగీకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భూమా వర్గీయులతో ఉన్న సన్నిహత సంబంధాల కారణంగానే కాకుండా రాజకీయ కోణంలో ఆలోచించినా ఆయన దానికి అంగీకరించవచ్చునని అంటున్నారు.