నల్లధనం పై సమాచారం లేదంటున్న రిజర్వు బ్యాంకు

SMTV Desk 2017-09-05 14:15:17  Black money, Reserve Bank, white money

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05 : పెద్ద నోట్ల రద్దు ద్వారా ఎంత నల్లధనం అంతమైందో తమ వద్ద సమాచారం లేదని రిజర్వు బ్యాంకు చెప్పింది. పాత నోట్ల మార్పిడి ద్వారా నల్లధనం ఎంత మొత్తం తెల్లధనంగా మారిందో తెలియదని స్పష్టం చేసింది. రద్దైన నోట్లలో ఒక శాతం మినహా మిగిలినవన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని వెల్లడైన నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం అడిగిన ప్రశ్నలకు రిజర్వు బ్యాంకు ఈ మేరకు జవాబులు ఇచ్చింది. నిర్ణీత సమయంలో పెద్ద నోట్ల రద్దును మళ్లీ మళ్లీ చేపట్టాలని ఏమైనా ప్రణాళికలు రచించారన్న ప్రశ్నకు ఆర్ బీఐ తెలీదని జవాబు ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి వార్షిక నివేదికలో పేర్కొన్నగణాంకాలనీ పార్లమెంటరీ సంఘం ముందు ఉంచిన రిజర్వు బ్యాంకు ఆ లెక్కలన్నీ అంచనాలనే తెలిపింది. తిరిగి వచ్చిన నోట్లన్నీ అసలైననవో కాదో సరిచూసి వాటిని లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తర్వాతే ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా జీడీపీ తగ్గడంపై నేరుగా సమాధానం ఇవ్వని ఆర్ బీఐ సేవా పారిశ్రామిక రంగాల మంద గమనంతో వృద్ధి రేటు తగ్గడం 2016-2017 లోనే ప్రారంభమైందని చెప్పుకొచ్చింది.