ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యేక న్యాయస్థానాలు

SMTV Desk 2017-06-04 12:40:11  hyderabad, trafic, trafic courts, special courts

హైదరాబాద్, జూన్ 4 : ట్రాఫిక్ ఉల్లంఘనలతో సంభవించే ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నచర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఉల్లంఘనలను నివారించడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా తగ్గించవచ్చని ఆ విభాగం అడుగులు ముందుకు వేస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను విచారించేందుకు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ ఉల్లంఘన ఫిర్యాదును విచారించేందుకు పద్దెనిమిది కోర్టులు నిర్విరామంగా పనిచేయడంతో పాటు మరో రెండు ట్రాఫిక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు న్యాయ విభాగం సిద్ధమైంది. ఇందుకోసమై అనుకూలమైన భవనాల వేట సాగుతుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహన చోదకులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించేవారు. అయితే 2011 నుండి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై అభియోగ పత్రాలు దాఖలు చేస్తూ..జైలు శిక్ష పడేలా ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. అదే విధంగా మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నవారిని, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిని, ఈ-చాలన్ల బకాయిలు చెల్లించని వారిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఆ కారణంగా పలువురుపై ట్రాఫిక్ ఉల్లంఘనులకు కోర్టుల ద్వారా శిక్షలు సైతం ఖరారవుతున్నాయి. ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేసే ట్రాఫిక్ కోర్టు ఒకటే కొనసాగుతున్నది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో 18 కోర్టులు పనిచేస్తున్నాయి. అయితే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ట్రాఫిక్ సంబంధిత అంశాలతో పాటు వరకట్న వేధింపులు వంటి ఇతర కేసుల్నీ విచారించాల్సి ఉండడంతో ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం ఉదయం 08:30 నుండి 10:30 గంటల వరకు మార్నింగ్ కోర్టులుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఉదయంతో పాటు సాయంత్రం 5 నుండి 7గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అదనంగా భవనాలు సమకూరిస్తే 18 కోర్టులు నిర్విరామంగా పనిచేసేలా చర్యలు చేపట్టి, రెండు ట్రాఫిక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు న్యాయవిభాగం హామి ఇవ్వడంతో తదనుగుణంగా కార్యచరణ కొనసాగుతున్నది.