పాట రూపంలో పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తిన జొన్న విత్తుల

SMTV Desk 2019-12-02 15:43:25  

ఇటీవల ఏపీలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం వెలువరించినప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికీ విపక్షాలు తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తనదైన శైలిలో గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఓ పాట రూపంలో పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తేశారు. అమ్మ భాష కోసం ఎవడున్నాడప్పా... పవన్ కల్యాణ్ ఒక్కడే కనిపించాడప్పా అంటూ రాగయుక్తంగా ఆయన ఓ గీతం ఆలాపించారు.చెప్పేందుకు ఏముందీ మీ గొప్ప... చేసేందుకు ఏముందీ మీ గోల తప్పా అంటూ ఆయన రూపొందించిన పాట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఇంగ్లీషు మీడియం అంశం నేపథ్యంలో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలే జొన్నవిత్తుల అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు.