అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా?

SMTV Desk 2019-11-30 16:33:40  

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే ఆరు నెలలలో జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పాలన గురుంచి కొందరు పర్వాలేదని అంటుంటే, మరికొందరు మాత్రం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన ఏపీ అభివృద్ధిలో వెనకబడుతుందని ఆరోపిస్తున్నారు.

అయితే తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 6 నెలలలో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడమే అని, 6 నెలలలో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని ఆరోపించారు. అంతేకాదు ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని జగన్‌ని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి నన్నే ఆరోపిస్తున్నారని, పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని మండిపడ్డారు.