ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన విద్యాశాఖ మంత్రి

SMTV Desk 2019-11-29 16:20:18  

రంగారెడ్డి: ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను సబితా ఓదార్చారు. తమ కూతురును పొట్టనపెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక్ రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి మంత్రిని కోరాడు. తమకు ఇల్లు తప్ప తమకు ఏదీ లేదన్నాడు. పోలీస్ శాఖ ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని మంత్రి సబిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు పోలీస్ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ షీ టీమ్స్ ప్రవేశపెట్టారని, షీ టీమ్స్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ మాదిరిగానే, షీ టీమ్స్ నంబర్ కూడా మహిళలు తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. మహిళలు 112కు ఫోన్ చేస్తే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రియాంకరెడ్డి కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని చటాన్ పల్లి వంతెన వద్ద వెటర్నరీ సర్జన్ ప్రియాంకరెడ్డి(22)ని బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి ఆపై సజీవదహనం చేసిన విషయం తెలిసిందే.