ప్రభాస్‌తో సినిమాకు విశ్వప్రయత్నాలు!

SMTV Desk 2019-11-26 12:01:51  

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన కరణ్‌కు అక్కడ ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో చాలా బాగా తెలుసు. అందుకే ప్రభాస్‌తో ఓ భారీ బడ్జెట్‌ సినిమా చేస్తే బాగుంటుదంని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌ను ఇంత వరకు బాలీవుడ్ నిర్మాతలెవరకీ ఓకే చెప్పలేదు. గతంలో ఇదే విషయంలో ప్రభాస్‌, కరణ్‌ మధ్య దూరం పెరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు కరణ్‌. ఇటీవల ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా కూడా బాలీవుడ్‌లో భారీ వసూళ్లనే సాధించింది. ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా బాలీవుడ్‌ నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ప్రభాస్‌ ఇమేజ్‌ నార్త్‌లో మరింత పెరిగింది. ప్రస్తుతం జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పాన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. జాన్‌ తరువాత ప్రభాస్‌ చేయబోయే సినిమా ఏంటన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సైరా నరసింహారెడ్డి సినిమాతో ఆకట్టుకున్న సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్‌ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. సురేందర్‌ రెడ్డి కూడా ప్రభాస్‌తో భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నాడట. అందుకే సురేందర్‌ కథ ఓకే అయితే ఈ సినిమాను కరణ్‌ బ్యానర్‌లో చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్‌. అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.